నియోజకవర్గాల పునర్విభజన: దక్షిణాది అస్థిత్వానికి సవాలేనా?

డిలిమిటేషన్


పునర్’విభజన’ రాజకీయం

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ‘ఒక ఓటు – ఒకే విలువ’ అనేది ప్రాథమిక సూత్రం. అయితే, త్వరలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ఈ సూత్రాన్ని అమలు చేసే క్రమంలో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఈ ప్రక్రియను తమ ఉనికికి, రాజకీయ ప్రాబల్యానికి ముప్పుగా పరిగణిస్తున్నాయి. జనాభా నియంత్రణలో ఆదర్శంగా నిలిచినందుకు ప్రత్యేక ప్రయోజనాలకు బదులు, శిక్ష పడబోతోందా? అనే ప్రశ్న ఇప్పుడు మిన్నంటుతోంది.


చారిత్రక నేపథ్యం:

రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం, ప్రతి జనాభా గణన తర్వాత నియోజకవర్గాల సరిహద్దులు మార్చాలి. కానీ, 1970లలో ప్రవేశపెట్టిన జాతీయ కుటుంబ నియంత్రణ విధానం రాష్ట్రాల మధ్య అసమతుల్యతను సృష్టించింది. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నీయంత్రణను సమర్ధవంతంగా అమలుచేయగా, ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా విస్ఫోటనం సంభవించింది. ఈ వ్యత్యాసాన్ని గమనించిన అప్పటి కేంద్ర ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 2001 వరకు డీలిమిటేషన్‌ను నిలిపివేసింది. అనంతరం 2002లో వాజ్‌పేయి ప్రభుత్వం దీనిని 2026 వరకు పొడిగించింది.

దక్షిణాది భయాలు: రాజకీయ శిక్ష?

రాబోయే పునర్విభజన 2021 (వాయిదా పడిన) లేదా రాబోయే జనాభా గణన ఆధారంగా జరిగితే, లోక్‌సభలో సీట్ల కేటాయింపు గణనీయంగా మారిపోతుంది.

  • ప్రాతినిధ్యంలో కోత: ఉదాహరణకు, 1971లో తమిళనాడు మరియు రాజస్థాన్ జనాభా దాదాపు సమానంగా ఉండేది. కానీ నేడు రాజస్థాన్ జనాభా తమిళనాడు కంటే చాలా ఎక్కువ. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల ఎంపీల సంఖ్య భారీగా పెరుగుతుంది.
  • నిర్ణయాత్మక శక్తి కోల్పోవడం: ప్రస్తుతం దక్షిణాదికి చెందిన 129 మంది ఎంపీలు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నారు. పునర్విభజన తర్వాత ఉత్తరాది రాష్ట్రాల సీట్లు 50% పైగా పెరిగితే, దక్షిణాది మద్దతు లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది దేశ విధాన నిర్ణయాల్లో దక్షిణాది గొంతును బలహీనపరుస్తుంది. ఇది దేశ సమాఖ్య విధానానికే విఘాతంలా పరినమిస్తుంది.

అభివృద్ధికి విఘాతమా?

దక్షిణాది రాష్ట్రాలు విద్య, వైద్యం, మరియు ఆర్థిక రంగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. జనాభాను తగ్గించి, తలసరి ఆదాయాన్ని పెంచుకున్నందుకు సీట్లు తగ్గించడం అంటే ‘సమర్థతను శిక్షించడమే’ అవుతుంది. జనాభా నియంత్రణ తమకు ప్రయోజనాలను కల్పించకపోగా, పునర్విభజనలో అన్యాయం జరుగుతుంది అనే వాదన దక్షిణాదిలో బలపడుతుంది.

  • ఆర్థిక వనరులు: ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల దక్షిణాది రాష్ట్రాలు తమ పన్ను ఆదాయంలో ఎక్కువ వాటాను కోల్పోతున్నాయనే అసంతృప్తి ఉంది. ఇప్పుడు రాజకీయ అధికారం కూడా తగ్గితే, భవిష్యత్తులో నిధుల కేటాయింపులో దక్షిణాది మరింత వివక్షకు గురయ్యే ప్రమాదం ఉంది.

పరిష్కార మార్గాలు: మధ్యేమార్గం అవసరం

ప్రజాస్వామ్యంలో జనాభాకు ప్రాతినిధ్యం కల్పించడం ఎంత ముఖ్యమో, సమాఖ్య వ్యవస్థలో భాగస్వామ్య రాష్ట్రాల హక్కులను కాపాడటం కూడా అంతే ముఖ్యం. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఈ క్రింది అంశాలను పరిశీలించవచ్చు:

  1. సీట్ల సంఖ్య పెంపు – ప్రస్తుత నిష్పత్తి రక్షణ: ఏ రాష్ట్రానికీ ప్రస్తుతమున్న సీట్ల సంఖ్య తగ్గకుండా చూస్తూ, కొత్త సీట్లను అదనంగా చేర్చాలి. అయితే ఇది రాష్ట్రాల మధ్య రాజకీయ సమతుల్యతను మార్చకూడదు.
  2. అభివృద్ధి సూచికలకు ప్రాధాన్యత: సీట్ల కేటాయింపులో కేవలం జనాభాను మాత్రమే కాకుండా.. అక్షరాస్యత, తలసరి ఆదాయం, మరియు సామాజిక అభివృద్ధిని కూడా ప్రామాణికంగా తీసుకోవాలి.
  3. రాజ్యసభ సంస్కరణలు: అమెరికా సెనెట్ తరహాలో, జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలకు రాజ్యసభలో సమాన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా పెద్ద రాష్ట్రాల ఆధిపత్యాన్ని అడ్డుకోవచ్చు.

ముగింపు

భారతదేశం ‘విభిన్నత్వంలో ఏకత్వం’ కలిగిన దేశం. ఉత్తరాది జనాభా పెరుగుదల, దక్షిణాది అభివృద్ధి.. రెండూ దేశ వాస్తవాలే. కేవలం సంఖ్యాబలంతో ఒక ప్రాంతంపై మరో ప్రాంతం ఆధిపత్యం చెలాయించేలా డీలిమిటేషన్ ఉండకూడదు. రాజకీయ ప్రయోజనాల కంటే దేశ సమగ్రతకు, రాష్ట్రాల మధ్య సోదరభావానికి ప్రాధాన్యతనిస్తూ ఒక శాస్త్రీయమైన, ఆమోదయోగ్యమైన విధానాన్ని రూపొందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.


పునర్విభజన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడటానికి రాజ్యాంగపరంగా ఎటువంటి రక్షణలు అవసరమని మీరు భావిస్తున్నారు?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top