
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ఒక విగ్రహానికో, ఫొటోకో దండ వేసి మమ అనిపించేస్తాం. కానీ, అసలు అంబేద్కర్ ఎవరు? ఆయన జీవితం నేటి తరం యువతకు ఏం నేర్పిస్తుంది? కేవలం కుల వివక్షపై పోరాటం మాత్రమేనా ఆయన జీవితం? కాదు, అంతకు మించి మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి.
1. 9 భాషలు.. 32 డిగ్రీలు..
అక్షరమే ఆయన ఆయుధం! ఆ రోజుల్లోనే అంబేద్కర్ గారు 9 భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. విదేశాల్లో రెండు డాక్టరేట్లు పొందిన తొలి భారతీయుడు ఆయనే కాలం ఎన్ని సవాళ్లను విసిరినా దృఢచిత్తంతో అనుకున్నది సాధించాడు. మనం ఒక చిన్న సమస్య వస్తే చదువు ఆపేస్తాం. కానీ ఆయన దగ్గర చదువుకోవడానికి పుస్తకాలు లేవు, కూర్చోవడానికి బెంచీలు లేవు.అసలు చదువే అందుబాటులో లేదు. అయినా సరే ‘జ్ఞానం’ అనే ఆయుధంతో ప్రపంచాన్ని గెలిచారు. ఆయన పూర్తి చేసిన డిగ్రీల కన్నా , ఆ డిగ్రీల వెనుక ఉన్న కష్టం ముఖ్యం.
2. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెనుక ఉన్న మెదడు!

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, మన దేశ సెంట్రల్ బ్యాంక్ (RBI) స్థాపనకు పునాది వేసింది అంబేద్కర్ గారే. ఆయన రాసిన “The Problem of the Rupee: Its Origin and Its Solution” అనే గ్రంథం ఆధారంగానే RBI రూపుదిద్దుకుంది. ఆయన కేవలం సామాజిక విప్లవకారుడు మాత్రమే కాదు, గొప్ప ఆర్థికవేత్త కూడా!
3. నేటి సమాజానికి ఆయన నేర్పిన ‘లైఫ్ లెసన్’
నేటి రాజకీయాలు, సమాజం కులాల చుట్టూ తిరుగుతుండొచ్చు. కానీ అంబేద్కర్ గారి కల ‘సమానత్వం’.ఆయన ఏ వర్గానికో పరిమితం కాలేదు. మహిళలకు ఆస్తి హక్కు ఉండాలని (Hindu Code Bill), కార్మికులకు పని గంటలు తగ్గించాలని (12 గంటల నుండి 8 గంటలకు) పోరాడిన మహనీయుడు.ఆయన దృష్టిలో దేశభక్తి అంటే మనుషులను ప్రేమించడం, మనుషులకు హక్కులు కల్పించడం.
4. కొలంబియా యూనివర్సిటీలో ఆ ఫోటో!
అంబేద్కర్ గారు చదువుకున్న కొలంబియా యూనివర్సిటీలో వందల ఏళ్ల చరిత్ర ఉంది. అక్కడ ఎంతో మంది మేధావుల ఫోటోలు ఉంటాయి. కానీ అక్కడ ఒక ప్రత్యేకమైన బోర్డుపై “Symbol of Knowledge” (జ్ఞానానికి ప్రతీక) అని రాసి అంబేద్కర్ గారి ఫోటో ఉంటుంది. ప్రపంచం ఆయనను అలా గౌరవిస్తోంది. మరి మనం?
ముగింపు (The Raw Talk):
అంబేద్కర్ గారిని మనం ఒక కులానికి పరిమితం చేయడం అంటే, సముద్రాన్ని ఒక చిన్న సీసాలో దాచాలని చూడటమే. ఆయన అందరివాడు. రాజ్యాంగం ద్వారా మన చేతికి ‘ఓటు’ అనే బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చారు. మనం చేయాల్సిన నివాళి ఒక్కటే.. కులమతాలకు అతీతంగా ఎదగడం, ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోవడం, నిరంతరం చదువుకోవడం.జ్ఞానమే బలం.. చదువే విముక్తి!అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం.
జై భీమ్ – జై భారత్!!